వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబునాయుడు పై విరుచుకుపడ్డారు. "చంద్రబాబూ.... నేరుగా అడుగుతున్నా. ఇంతకీ డాక్టర్ రమేష్ ను మీ ఇంట్లో దాచారా? లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?" అని ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి. 

ఇకపోతే... రమేష్ ఆసుపత్రి హెడ్ రమేష్ కుమార్ అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ యజమాని కూడా పరారీలో ఉన్నాడు. స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రికి మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అధికారులకు సమర్పించలేదు. 

స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రమేశ్ ఆసుపత్రి అన్ని రకాలుగా నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది. 

ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోలేదని... డబ్బు సంపాదనే ధ్యేయంగా నిబంధనలను రమేశ్ ఆసుపత్రి పట్టించుకోలేదని నివేదికలో వెల్లడించింది. పది మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణం రమేశ్ ఆసుపత్రేనని, కరోనా నెగిటివ్ వచ్చిన వారిని కూడా చేర్చుకున్నారని కమిటీ పేర్కొంది.

కోవిడ్ సోకిన వారికి వైద్య చికిత్స కోసం నిర్దేశించిన ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని తెలిపింది. స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిమాపక ప్రమాణాలు ఉన్నాయా..? లేవా..? చూసుకోకుండా కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారని కమిటీ చెప్పింది. కోవిడ్ సోకిందన్న సోకిందన్న అనుమానం వున్న వారిని, సోకని వారని ఆసుపత్రిలో ఒకే చోట చేర్చుకున్నారని విచారణ కమిటీ పేర్కొంది.

కాగా, కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నోటీసులుఇచ్చినా కూడా తమ ముందు హాజరు కావడానికి సాకులు చెబుతున్నారని పోలీసులు అంటున్నారు.

తమ దర్యాప్తులో పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలను పంపించారు. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మరణించిన విషయం తెలిసిందే.