హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీకి స్థానికంగా ఉన్న నేతలు కొందరు  ఇతర పార్టీల నుండి  తమ పార్టీలోకి రాకుండా అడ్డుకొంటున్నారనే  విమర్శలు ఉన్నాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీ రాష్ట్రంలో బలపడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే  టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కొందరు బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది.
 
ఏపీ రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం కూడ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండానే జాతీయ నాయకత్వం కొందరు నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తుంది.

కొందరు కీలక నేతలు పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న సమయంలో కూడ స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు  అడ్డుకొంటున్నారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా కొందరు నేతలు బీజేపీని వదిలి వైసీపీని ఎంచుకొన్నారని ఏపీ రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది.

రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంది.

ఈ ఏడాది ఏఫ్రిల్  మాసంలో జరిగిన ఎన్నికలకు ముందు  ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్‌బై చెప్పి  జనసేనలో చేరారు.  ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా  ఆకుల సత్యనారాయణ రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

అయితే ఆకుల సత్యనారాయణ జనసేనను వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకొన్నాడు.  అయితే తిరిగి ఆయన బీజేపీలో చేరాలని భావించాడు. అయితే ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆకుల సత్యనారాయణ చేరికను వ్యతిరేకించినట్టుగా కమలదళంలో ప్రచారం సాగుతోంది.బీజేపీలో చేరేందుకు ఆకుల సత్యనారాయణ తీవ్రంగా ప్రయత్నించి విసిగిపోయారంటున్నారు.

బీజేపీలో చేరేందుకు అవకాశాలు లేకపోవడంతో ఆకుల సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారని సమాచారం. మరో వైపు  కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడ బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ మేరకు ఆదినారాయణరెడ్డి  న్యూఢిల్లీలో బీజేపీ నేతలను కూడ  కలిశారు. బీజేపీలో చేరే  విషయమై ఆదినారాయణరెడ్డికి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదని ప్రచారం సాగుతోంది.

కడప జిల్లా నుండి ఎంపీగా కొనసాగుతున్న సీఎం రమేష్ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరికను వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.దీంతో ఆదినారాయణరెడ్డి చేరికకు  బ్రేక్ పడినట్టుగా సమాచారం. 

2014 ఎన్నికల్లో  జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో ఆదినారాయణరెడ్డి  వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో ఆయన టీడీపీలో చేరాడు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఆదినారాయణరెడ్డి మంత్రిగా కూడ పనిచేశాడు,.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  కడప ఎంపీ స్థానం నుండి ఆదినారాయణరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలైంది. దీంతో ఆదినారాయణరెడ్డి   బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నాడు. కానీ, బీజేపీలో స్థానిక నేతలు అడ్డుకొన్నారనే ప్రచారం సాగుతోంది.