ఏపీ సీఎం వైఎస్ జగన్  సచివాలయానికి  తక్కువగా వెళ్తున్నారు. అయితే దీనికి కూడ ఓ కారణం ఉందని సమాచారం. సచివాలయంలోనే పలు శాఖ సమీక్షలు నిర్వహించనున్నట్టు జగన్ షెడ్యూల్‌లో ఉంటుంది

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ సచివాలయానికి తక్కువగా వెళ్తున్నారు. అయితే దీనికి కూడ ఓ కారణం ఉందని సమాచారం. సచివాలయంలోనే పలు శాఖ సమీక్షలు నిర్వహించనున్నట్టు జగన్ షెడ్యూల్‌లో ఉంటుంది. కానీ, చివరి నిమిషంలో ఈ కార్యక్రమాలు రద్దౌతున్నాయి. సమీక్షలను మాత్రం జగన్ క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. 

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం బదిలీలు జరుగుతన్నాయి. అయితే బదిలీల కోసం సచివాలయం చుట్టూ తిరిగే ఉద్యోగుల సంఖ్య రోజుకు వందల సంఖ్యలో ఉంటుంది.తమ ఇబ్బందులను సీఎంకు చెప్పుకొని అనువైన చోటుకు బదిలీ చేయించుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సచివాలయానికి జగన్ రావడం మానేశారు.

ఈ ఏడాది ఆగష్టు 1వ తేదీ నుండి సీఎం జగన్ సచివాలయానికి వస్తారని చెబుతున్నారు. గత నెల 8వ తేదీన జగన్ తొలిసారిగా సెక్రేటరియట్‌లోకి అడుగుపెట్టారు. అదే రోజు మంత్రివర్గ విస్తరణ జరిగింది. 

అమరావతిలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఆరు బ్లాక్‌ల్లో సచివాలయాన్ని నిర్మించారు. ఆరవ బ్లాక్‌లో అసెంబ్లీ, శాసనమండలిని నిర్మించారు. ఐదవ బ్లాకులో వివిద శాఖల ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయం మొదలి బ్లాక్‌లోని తొలి అంతస్తులో సీఎం కార్యాలయం, సీఎం చీఫ్ సెక్రటరీ కార్యాలయం, కేబినెట్ సమావేశ మందిరాలు ఉన్నాయి.

చంద్రబాబునాయుడు పార్టీ సమావేశాలు, జిల్లాల పర్యటనలు లేని రోజుల్లో ఉదయాన్నే సెక్రటేరియట్‌కు వచ్చేవారు. పలు శాఖల సమీక్షలు నిర్వహించేవారు. కొన్ని సమయాల్లో అర్ధరాత్రి వరకు కూడ సమీక్షలు కొనసాగేవి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కువ సేపు సమీక్షలు నిర్వహించడం లేదు.క్యాంపు కార్యాలయంలోనే జగన్ ఎక్కువగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో తమకు అనకూలమైన చోటుకు బదిలీ కోసం ఉద్యోగులు సిఫారసు లేఖలను తీసుకొని మరీ వస్తున్నారు. బదిలీలు పారదర్శకంగా జరగాలని ఆదేశాలు జారీ చేసినా కూడ మళ్లీ జోక్యం చేసుకోవడం సరైంది కాదనే అభిప్రాయంతో జగన్ ఉన్నారంటున్నారు.

మరో వైపు సచివాలయంలోని సీఎం పేషీ కూడ పూర్తిగా అందుబాటులోకి రావాల్సిన అవసరం కూడ ఉందని సమాచారం.ఈ కారణాల వల్లే జగన్ సెక్రటేరియట్ కు తక్కువగా వస్తున్నారని చెబుతున్నారు.