అమరావతి:ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిని ఇస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై  రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.ఏపీలో సీబీఐ విచారణకు టీడీపీ సర్కార్  విధించిన నిషేధాన్ని జగన్ సర్కార్ గురువారం నాడు ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది.

ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో  176 జీవోను జారీ చేశారు. ఈ జీవో ద్వారా ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు సీబీఐ అధికారులు రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తే కనీసం భద్రత కూడ కల్పించమని ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది.

ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏకు టీడీపీ గుడ్‌బై చెప్పింది. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసాన్ని పెట్టింది. ఆ తర్వాత టీడీపీకి చెందిన కొందరు నేతలు,ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల ఇళ్లపై సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు జరిగాయి.

తమ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని  బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకొని దాడులకు పాల్పడుతోందని ఆనాడు టీడీపీ ఆరోపణలు చేసింది.దీంతో  2018 నవంబర్ 8వ తేదీన చంద్రబాబునాయుడు ప్రభుత్వం 176 జీవోను జారీ చేసింది. అయితే వైఎస్ జగన్ సర్కార్ ఈ జీవోను రద్దు చేస్తూ గురువారం నాడు 81 జీవోను జారీ చేసింది.

చంద్రబాబు సర్కార్‌పై ఆనాడు విపక్షంలో వైసీపీ, బీజేపీ నేతలు కూడ తీవ్రమైన ఆరోపణలు చేశారు. పలు అంశాలపై సీబీఐ విచారణకు కూడ ఆ పార్టీలు డిమాండ్ చేశాయి.

తాజాగా బుధవారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 7 లేఖలు రాశారు.  సీబీఐ విచారణ జరపాలని కూడ  డిమాండ్ చేశారు. రాజధాని భూముల విషయంలో, అగ్రిగోల్డ్, పోలవరం ప్రాజెక్టు విషయంలో  అనేక అవకతవకలు చోటు చేసుకొన్నాయని  చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ ఆరోపణలు చేసింది.

ప్రస్తుతం సీబీఐ కు ఏపీలో అనుమతి ఇవ్వడంపై వెనుక జగన్ సర్కార్  వ్యూహత్మకంగానే వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు విపక్షంలో తాము ఆరోపణలు చేసిన విషయాలపై  సీబీఐ విచారణకు ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వనుందా అనే చర్చ సాగుతోంది. 

కొన్ని ప్రాజెక్టులు, టెండర్ల వ్యవహరాల్లో  టీడీపీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందని విపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపణలు చేసింది.తాము ఆరోపణలు చేసిన విషయాలపై వైసీపీ సర్కార్ విచారణకు అనుమతి ఇచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు లేకపోలేదు.