కాంగ్రెస్‌లోకి కిరణ్‌కుమార్ రెడ్డి: తమ్ముడేం చేస్తారు?

What is the next step of Nallari kishore kumar Reddy
Highlights

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 13వ తేదీన కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.ఇప్పటికే నల్లారి కిరణ్‌కుమర్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డి టీడీపీలో చేరారు. కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా... తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని కిషోర్ కుమార్ రెడ్డి తన అనుచరులకు చెబుతున్నారని సమాచారం.


చిత్తూరు:  ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.ఈ నెల 13వ తేదీన కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరారు.అయితే కిషోర్‌కుమార్ రెడ్డి ఏం చేస్తారనే చర్చ సర్వత్రా నెలకొంది.  అయితే  రాజకీయంగా ఇద్దరు వేర్వేరు పార్టీల్లో కొనసాగే పరిస్థితి నల్లారి కుటుంబంలో తొలిసారి నెలకొందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి  కొనసాగారు. రాష్ట్ర విభజనను  కిరణ్‌కుమార్ రెడ్డి  తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా విబేధించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ తరపున  2014 ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలో దింపారు. కానీ, ఆ పార్టీ తరపునఎవరూ విజయం సాధించలేదు. 

ఎన్నికల్లో  జై సమైక్యాంధ్ర పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో క్రియాశీలక రాజకీయాలకు కిరణ్‌కుమార్ రెడ్డి దూరంగా ఉంటున్నారు.  కొంత కాలం తర్వాత బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని కూడ కిరణ్‌కుమార్ రెడ్డిపై   ప్రచారం సాగింది. కానీ, ఆయన బీజేపీలో చేరలేదు. 

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీగా  ఉమెన్ చాందీ నియామకం కాగానే 2014కు ముందు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉన్న నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకత్వం చేపట్టింది.

అదే సమయంలో కిరణ్‌కుమార్ రెడ్డి తన రాజకీయ గురువుగా భావించే మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరాలని కిరణ్‌కుమార్ రెడ్డికి సలహా ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. ఈ నెల 13వ తేదీన కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ఇదిలా ఉంటే  చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి  సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి  గత ఏడాది జనవరి 23వ తేదీన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

చిత్తూరు జిల్లాకు చెందిన  మంత్రి అమర్‌నాథ్ రెడ్డి  నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని టీడీపీలో చేరేలా రాయబారాన్ని నడిపారు.ఈ రాయబారం సక్సెస్ అయింది.దీంతో ఆయన టీడీపీలో చేరారు. కిషోర్‌కుమార్ రెడ్డి తనయుడు అమర్‌నాథ్ రెడ్డి కూడ  టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు.

ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో తమను అంటిపెట్టుకొని ఉన్న తమ వర్గీయులతో సమావేశాలు నిర్వహించి  కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరే ముందు ఈ విషయాన్ని తాను తన సోదరుడు కిరణ్‌కుమార్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి  ఆ సమయంలో కొంత కాలం వేచి చూడాలని తన సోదరుడికి సూచించారని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ, రాజకీయంగా తమ వర్గానికి ఎదురౌతున్న ఇబ్బందుల దృష్ట్యా నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కిరణ్‌కుమార్ రెడ్డికి కీలక పదవి లభించే అవకాశం లేకపోలేదు.  

అయితే  కిషోర్‌కుమార్ రెడ్డి ఏం చేస్తారనే  చర్చ సాగుతోంది.  అయితే  కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా.. తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని కిషోర్‌కుమార్ రెడ్డి తన అనుచరులకు చెబుతున్నారని సమాచారం. సోదరులు వేర్వేరు పార్టీల్లోకి వెళ్లడం క్యాడర్‌లో కొంత అయోమయానికి కారణమయ్యే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు లేకపోలేదు.

కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా, స్పీకర్‌గా, విప్‌గా పనిచేసిన కాలంలో  కూడ నియోజకవర్గంలో కిషోర్‌కుమార్ రెడ్డి  క్రియాశీలకంగా వ్యవహరించేవారని  ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవి కిరణ్‌కు దక్కే అవకాశం ఉన్నందున  కిరణ్‌కుమార్ రెడ్డి  జిల్లా నుండి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే రాజంపేట నుండి పోటీ చేయాలి. చిత్తూరు జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడ్డాయి.  రాజ్యసభ సభ్యుడిగా కిరణ్‌కుమార్ రెడ్డి సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

తన సోదరుడు కాంగ్రెస్ పార్టీలో చేరినా తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి తన అనుచరులకు స్పష్టం చేస్తున్నారని చిత్తూరు జిల్లాలో ప్రచారం సాగుతోంది. 
 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader