అమరావతి: మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ గుడ్‌బై చెప్పడంతో లక్ష్మీనారాయణ నెక్స్ స్టెప్ ఏమిటనే విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 30వ తేదీన జనసేకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్‌బై చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడాన్ని జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. ఈ కారణం చూపుతూ జనసేనకు  బైబై చెప్పారు.  సినిమాల్లో తాను నటించడాన్ని కారణంగా చూపుతూ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.

also read:కోటి ఖర్చు చేస్తా, మీరు వెయ్యి పెట్టగలరా: మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ విసుర్లు

సినిమాల్లో నటించకపోతే తాను తన కుటుంబంతో పాటు పార్టీని నడపడం కష్టమని తేల్చిపారేశారు. కష్టపడి సంపాదించిన డబ్బులను వెయ్యి రూపాయాలను కనీసం ఖర్చు పెడతారా అంటూ జేడీ లక్ష్మీనారాయణపై  ఘాటుగానే స్పందించారు.

గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్టణం పార్లమెంట్ స్థానం నుండి జేడీ లక్ష్మీనారాయణ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఎన్నికల సమయంలోనే ఆయన జనసేనలో చేరాడు.

జనసేనలో చేరడానికి ముందే  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన జేడీ లక్ష్మీనారాయణ పార్టీని ఏర్పాటు చేస్తారని అప్పట్లో ప్రచారం సాగింది.పార్టీ ఏర్పాటు ఆలోచనను జేడీ లక్ష్మీనారాయణ చివరి నిమిషంలో విరమించుకొన్నారని చెబుతారు.

ఎన్నికల సమయంలో జేడీ లక్ష్మీనారాయణ  జనసేనలో చేరాడు. విశాఖలో ఎంపీగా  పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత  జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

గత ఏడాది చివర్లో  ఇసుక కొరతను నిరసిస్తూ విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్‌ లో  జనసేన నేత లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మరునాడు జనసేన పార్టీ సమీక్ష సమావేశంలో కూడ ఆయన పాల్గొన్నారు.

ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. అమరావతిలో రైతులకు మద్దతుగా నిర్వహించిన జనసేన ఆందోళనల కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు.

బీజేపీ అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడానికి వెళ్లారు. ఆ సమయంలో  పవన్ కళ్యాణ్ తో పాటు కేవలం నాదెండ్ల మనోహర్ ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో చర్చల విషయాన్ని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో చర్చించారా లేదా అనేది కూడ చర్చ సాగుతోంది.

ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడ ఇదే విషయాన్ని ఆదివారం నాడు ప్రకటించారు. బీజేపీతో పొత్తు విషయం తనకు తెలియదన్నారు.  రాజకీయంగా నిలకడలేని పవన్ కళ్యాణ్ తో తాను కొనసాగలేనని జేడీ లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. రాజకీయంగా నిలకడలేని తత్వం పవన్ కళ్యాణ్‌ది అని  జేడీ లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.

జనసేన పార్టీలో ఉన్న సమయంలోనే ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనేతలతో రెండు కార్యక్రమాల్లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గత ఏడాది గురుపూజోత్సవంలో ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఇటీవల బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ తో కలిసి జేడీ లక్ష్మీనారాయణ  ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీజేపీ,ఆర్ఎస్ఎస్ నేతలతో జేడీ లక్ష్మీనారాయణకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. జనసేనకు గుడ్‌బై చెప్పిన జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతారా అనే చర్చ కూడ ప్రారంభమైంది. లేదా స్వంతంగా పార్టీ పెడతారా అనే చర్చ కూడ లేకపోలేదు.

పార్టీని నడపాలంటే అంతా ఆషామాషీ విషయం కాదు. ఈ కారణంగానే జేడీ లక్ష్మీనారాయణ ఏం చేస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది. ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తోంది.

ఈ తరుణంలో కీలకమైన నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతారని గత ఏడాది చివర్లో ప్రచారం సాగింది.కానీ, ఆయన బీజేపీలో చేరలేదు. జనసేనకు మాత్రం దూరమయ్యారు. 

జనసేనకు గుడ్‌బై చెప్పినందున జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ గూటికి చేరుతారా లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జేడీ లక్ష్మీనారాయణ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారని ఆసక్తి నెలకొంది.