అసలు ఓటుకునోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు సంగతేమిటి? ఓటుకునోటు కేసు కోర్టు విచారణలో ఉండగానే సుప్రింకోర్టు, హైకోర్టు జడ్జీలకు చంద్రబాబు ఏ విధంగా ప్రత్యేక విందులిస్తున్నారు? చంద్రబాబు రాష్ట్రపతిని కలవటం లేదా? నరేంద్రమోడితో భేటీలు జరపటం లేదా?
గుడ్డకాల్చి మీదేసయటంలో తెలుగుదేశంపార్టీ నేతలకు మించిన వారు ఏ పార్టీలోనూ ఉండరు. అటువంటి వారిలో బోండా ఉమ, యలమంచలి రాజేంద్రప్రసాద్, అచ్చెన్నాయడు, పంచుమర్తి అనూరాధ, టిడిపి ముసుగు వేసుకుని టివి చర్చల్లో కనబడే నరసింహారావు లాంటి వాళ్ళు ఇంకా కొందరున్నారు. వీళ్ళ అజెండా ఏమిటంటే వేదిక ఏదైనా సరే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటమే. వీళ్ళ మాటలు, ఆరోపణలన్నీ ఆవుపై వ్యాసాల్లాగే ఉంటాయి. వారు చేసే ఆరోపణల్లో వాస్తవాలు ఎంతో వారికే బాగా తెలుసు. అయినా సరే వారి ఆరోపణలు, మాటలన్నీ ట్రస్ట్ భవన్ స్ర్కిప్ట్ ప్రకారమే నడుస్తుంది.
జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడు, దాచుకున్నాడన్నది ఒక ఆరోపణ. 16 మాసాలు జైల్లో ఉన్న ఆర్ధిక నేరగాడు జగన్ కు రాష్ట్ర సమస్యలు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నది వారి వాదన. జగన్ దోచుకున్నదంతా బయటపెట్టేస్తే రుణమాఫీలు చేయవచ్చట, రాజధాని నిర్మించవచ్చట, రాష్ట్రంలో మౌళిక సదుపాయాలు కల్పంచటం దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం వరకూ అన్నీ చేసేయవచ్చన్నది వారి విచిత్రమైన వాదన.
తాజాగా రాజేంద్రప్రసాద్ మాట్లాడిన విషయం చూస్తే అదే విషయం స్పష్టంగా బోధపడుతుంది. జగన్ ఢిల్లీకి వెళ్ళే పనివేరు చెప్పే మాటలు వేరట. డొల్ల కంపెనీలపై ఈడీ విచారణ వేగం పుంజుకున్నపుడల్లా జగన్ వెంటనే పెద్దల కాళ్ళు పట్టుకునేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు ఆరోపించారు. అప్పటికేదో రాజేంద్రప్రసాద్ దగ్గరుండి అంతా చూస్తున్నట్లు. ఢిల్లీ నాయకత్వం టిడిపికి మిత్రపక్షమే కానీ వైసీపీకి కాదన్న విషయం మరచిపోయినట్లున్నారు. ఒకవేళ జగన్ ఢిల్లీకి వెళుతున్నది అందుకనే అయితే, మరి మిత్రపక్షంగా టిడిపి ఫైల్ అయినట్లే కదా?
ఇక, ఆర్ధికనేరగాడు జగన్ కు రాష్ట్రపతి ఎలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారటూ ఏకంగా రాష్ట్రపతినే నిలదీస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ అవకాశం ఉన్న వారి అపాయింట్మెంట్లు తీసుంటున్నారు, కలుస్తున్నారు. ఒకవేళ రాజేంద్రప్రసాద్ వాదనే నిజమనుకుందాం కాసేపు. మరి, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగొట్టిన కేంద్రమంత్రి సుజనా చౌధరి మాటేమిటి. నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరుల చరిత్రలేమిటి?
అసలు ఓటుకునోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు సంగతేమిటి? ఓటుకునోటు కేసు కోర్టు విచారణలో ఉండగానే సుప్రింకోర్టు, హైకోర్టు జడ్జీలకు చంద్రబాబు ఏ విధంగా ప్రత్యేక విందులిస్తున్నారు? చంద్రబాబు రాష్ట్రపతిని కలవటం లేదా? నరేంద్రమోడితో భేటీలు జరపటం లేదా? అప్పటికి చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నది కూడా విచారణలో ఉన్న తన కేసుల గురించేనని టిడిపి నేతలు అంగీకరిస్తారా?
