రానున్న ఎన్నికల్లో బీజీపీ మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా? ఒంటరిగా పోటీ చేస్తే సత్తా రాష్ట్రంలో బీజేపీకి ఉందా?

ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? టీడీపీకి మిత్ర పక్షంగా ఉండటం వలన కలిగిన లాభాలేంటి? ఇప్పటి వరకు బీజేపీకి జరిగిన నష్టం ఏమిటి ? రానున్న ఎన్నికల్లో బీజీపీ మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా? లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా? ఒంటరిగా పోటీ చేసే సత్తా రాష్ట్రంలో బీజేపీకి ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గం మంగళవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పార్టీ స్థితిగుతలపై చర్చించనున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఒకరి మద్దతుతో మరొకరు అధికారంలోకి వచ్చారు. అయితే.. సీఎం చంద్రబాబు.. టీడీపీ నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత తమ నేతలకు ఇవ్వడంలేదనే అసంతృప్తి చాలా మంది బీజేపీ నేతల్లో ఉంది. అందుకే రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చాలా సార్లు చెప్పారు.అయితే.. ఈ విషయంలో అధిష్టానం మాత్రం తన మనసులో మాట బయటపెట్టడం లేదు.

ఇదిలా ఉంటే.. పొత్తు విషయంలో బీజేపీ నేతలపై పలు విమర్శలు మొదలౌతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నా.. అంత స్టామినా ఆ పార్టీకి ఉందా? కనీసం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగల అభ్యర్థుల జాబితాను విడుదల చేయగలారా అనే ప్రశ్నలు కూడా బీజేపీ నేతలకు ఎదురౌతున్నాయి. మరోవైపు వైసీపీతో కూడా పొత్తు పెట్టుకుంటునే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.

ఇదిలా ఉంటే..పార్టీ అధ్యక్షుడిని మార్చాలనే విషయంపై బీజేపీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అయితే.. హరిబాబు.. బీజేపీని టీడీపీ తోక పార్టీగా మారుస్తున్నారని పలువురు నేతల వాదన. అందుకే వేరెవరినైనా అధ్యక్షుడిగా నియమించాలని చాలా కాలంగా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ రేసులో సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు.

గత కొంతకాలంగా ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలకు అధిష్టానం చెబుతూనే ఉంది. అయితే.. ఈ విషయంలో పార్టీ నేతలు విఫలమయ్యారనే చెప్పవచ్చు. పార్టీలో నేతలకే సరైన గుర్తింపు, అధికారం లేక ఇబ్బంది పడుతుంటే.. కొత్తగా ఆ పార్టీలో వచ్చి చేరే నేతల పరిస్థితి ఏలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఎవరూ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపలేదు. ఈ విషయంపై కూడా కార్యవర్గ సమావేశంలో చర్చిస్తారని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.