కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యంలో వైసిపి ఎంపిలు గనుక రాజీనామా చేస్తే తెలుగుదేశంపార్టీ పరిస్ధితేంటి? ఇదే చర్చ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. ప్రత్యేకహోదా రాదని తేలిపోతే తమ ఎంపిలు రాజీనామాలు ఇస్తారంటూ  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ప్రకటించారు.

సరే, ప్రత్యేకహోదా రాదని తేలిపోయినా ఇప్పటి వరకూ జగన్ ఆ విషయాన్ని ఏదో  ఓ రూపంలో నాన్చుతున్నారు. అయితే, తాజాగా ప్రవేశపెట్టింది ఎన్నికలకు ముందు పూర్తిస్ధాయి చివరి బడ్జెట్. ఇందులో కూడా ప్రత్యేకహోదా అంశాన్ని కేంద్రం ప్రస్తావించలేదు. దాంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యాయి.

ఇటువంటి నేపధ్యంలో వైసిపి ఎంపిలు గనుక పదవులకు రాజీనామాలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టిడిపి ఎంపిలు రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారంటే వైసిపి ఎంపిల రాజీనామాలకు కూడా డిమాండ్ చేస్తున్నట్లే లెక్క.

అధికారంలో ఉన్న టిడిపి ఎంపిలే ఏమీ చేయలేనపుడు ప్రతిపక్షంలోని ఎంపిలు ఏమీ చేయలేరన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే రాజీనామాలన్నది నిరసన తెలపటంలో ఓ భాగం మాత్రమే. ఇపుడు ప్రవేశపెట్టిందే చివరి బడ్జెట్ అని  టిడిపికి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరే చెబుతున్నారు. అటువంటప్పుడు ఎంపి పదవులకు రాజీనామాలు చేయటానికి వైసిపికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు.

ఈ అవకాశాన్ని గనుక వైసిపి ఉపయోగించుకుంటే టిడిపిపై ఒత్తిడి పెరగుతుంది. ఎటూ చంద్రబాబునాయుడుతో పాటు టిడిపి ఎంపిల మీద కూడా జనాలు మండిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలూ మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో టిడిపిపై ఒత్తిడి పెంచాలంటే వైసిపికి ఇంతకన్నా మార్గం లేదు. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వైసిపిలో చర్చలు జరుగుతున్నాయట.