ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను గండం పొంచి వుంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా  మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి శాస్త్రవేత్తలు ‘‘పెథాయ్’’గా నామకరణం చేశారు. ఇది ప్రస్తుతం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.

దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

తుఫాను తీవ్రత దృష్ట్యా ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావం తెలంగాణపైనా పడింది. రాజధాని హైదరాబాద్‌లో అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. 16, 17 కోస్తాంధ్రాపై పెథాయ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.