తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతికి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. తిరుపతి పట్టణానికి ఉత్తరాదిన 35 కిలోమీటర్ల దూరంలో నెల్లూరుకు నైరుతి దిశలో 70  కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

కొద్ది గంటల్లో మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్త్రాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

also read:చిత్తూరు జిల్లాలో విషాదం: రాళ్లవాగులో చిక్కుకొన్న రైతు మృతి

నివర్ తుఫాన్ ఏపీ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గంలో నివర్ తుఫాన్ ప్రజలను అతలాకుతలం చేసింది.

యర్రావారి పాలెం మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు, పొంగిపొర్లుతున్నాయి.జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. నివర్ తుఫాన్ కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తిరుపతికి సమీపంలోని వాయుగుండం ప్రభావం కారణంగా ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.