అమరావతి: పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచకపోతే రాయలసీమ కరువు తీరదని ఏపీ సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే శ్రీశైలం నుండి 800 అడుగుల వద్దే నీళ్లను వాడుకొంటామని ఆయన ప్రకటించారు.మన పాలన- మీ సూచనలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు సీఎం జగన్ వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు వ్యతిరేకిస్తున్నప్పటికీ పోతిరెడ్డిపాడుపై జగన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరని ఆ ప్రకటన ద్వారా అర్థమవుతోంది. ఇది ఒక రకంగా జగన్ కేసీఆర్ కు షాక్ ఇవ్వడమే.

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం, వివాదం సమసిపోయేనా...

ఏపీ, తెలంగాణకు సమాన న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల వద్ద నీరు ఉన్న సమయంలోనే 44 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లే వీలుందన్నారు. 881 అడుగుల వద్ద శ్రీశైలంలో నీరుంటే పోతిరెడ్డి పాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకోలేమని ఆయన చెప్పారు. 

854 అడుగుల నుండి రోజుకు 7 వేల క్యూసెక్కులను మాత్రమే ఉపయోగించుకొనే వీలుంటుందని జగన్ గుర్తు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 అడుగుల నుండి 524 అడుగుల ఎత్తుకు పెంచుతున్నారన్నారు. అంతేకాదు ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున కృష్ణా నది నుండి దిగువకు వచ్చే నీటి లభ్యత తగ్గుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కూడ 800 అడుగుల లోపుగానే ఉన్నాయన్నారు. 796  అడుగుల వద్ద శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ను ఉత్పత్తి  చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 885 అడుగుల వద్ద కేవలం 10 రోజులు మాత్రమే కృష్ణాకు వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతోనే 800 అడుగుల వద్ద నుండి ప్రతి రోజూ 3 టీఎంసీలను వాడుకొంటామన్నారు. తమ రాష్ట్రానికి రావాల్సిన నీటిని వాడుకొంటామని ఆయన ప్రకటించారు. 

దీని వల్ల ఎవరికి నష్టం కాదు, అన్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17 వేల 500 క్యూసెక్కుల నుండి 50 వేలకు పెంచుతామన్నారు. పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలిస్తామని చెప్పారు.

రాయలసీమ కరువు నివారణకు పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించగానే వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, టీడీపీతో పాటు కొన్ని  మీడియా సంస్థలపై యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని జగన్ చెప్పారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో మిగిలిన ప్యాకేజీలకు త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

కరోనాతో పోలవరం ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు సీఎం. 2021 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి లేకుండా చేశామన్నారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రజా ధనాన్ని ఆదా చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.