ఏలూరు: తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల అభివృద్దికి రూ15 వేల కోట్లను ప్రతి ఏటా ఖర్చు చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  హామీ ఇచ్చారు. ఐదేళ్లలో బీసీల కోసం రూ75 వేలను ఖర్చు చేస్తామన్నారు.

ఆదివారం నాడు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో వైసీపీ చీఫ్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.బీసీలకు సబ్ ప్లాన్‌ను తీసుకొస్తామన్నారు. ఈ సబ్ ప్లాన్‌కు చట్టబద్దతను కల్పిస్తామని ఆయన చెప్పారు.

తొలి అసెంబ్లీ సమావేశంలోనే సబ్ ప్లాన్ బిల్లుకు చట్టబద్దత చట్టాన్ని తెస్తామన్నారు. కార్పోరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి కులానికి కార్పోరేషన్ ఇస్తామన్నారు. 

బీసీల కులాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం భరించనున్నట్టు చెప్పారు.పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏటా రూ. 15వేలను  అందిస్తామని జగన్ ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌లో మూడో వంతు నిధులను  బీసీలకు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

నిర్లక్ష్యానికి గురైనట్టుగా ఏ కులం గురికాకుండా చర్యలు తీసుకొంటామని చెప్పారు. హాస్టల్‌లో ఉంటూ చదువుకొనే  విద్యార్థుల కోసం ప్రతి ఏటా రూ.20వేలను ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

బీసీ కమిషన్ ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నట్టు జగన్ ప్రకటించారు. బీసీ కమిషన్ ‌కు చట్టబద్దతను కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు.                 కులం సర్టిఫికెట్ కోసం కాళ్లు అరిగేలా తిరిగేలా ఉండకుండా చర్యలు తీసుకొంటామన్నారు. 

హేతుబద్దత లేకుండా మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసులను ప్రకటించారని బాబుపై జగన్ ఆరోపణలు చేశారు. 45 -60 ఏళ్ల  మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.75వేలను అందిస్తామని జగన్ హమీ ఇచ్చారు.  నాలుగు విడతలుగా  ఈ నిధులను అందిస్తామన్నారు. 

ప్రభుత్వ రంగంలోని సంస్థల్లో కాంట్రాక్టులకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు 50 శాతం ఇచ్చేలా చట్టాన్ని చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కుల వృత్తులు చేసేవారికి ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. వీరందరికీ ఎప్పుడు అవసరమైతే రూ.10వేలను ఎలాంటి వడ్డీ లేకుండా అందిస్తామని జగన్ ప్రకటించారు. 

బీసీలు రాజకీయంగా ఎదుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని నామినేటేడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై తొలి శాసనసభ సమావేశాల్లోనే చట్టం తెస్తామన్నారు.నామినేషన్ పద్దతిలో ఇచ్చే పనుల్లో కూడ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చేలా చట్టాన్ని తెస్తామన్నారు.

ప్రతి నాయీబ్రహ్మణుడి దుకాణానికి ప్రతి ఏటా రూ. 10 వేలు ఇస్తామన్నారు. సంచార జాతులకు గుర్తింపు ఇస్తామన్నారు. ఇళ్లు కట్టించడంతో పాటు ఉపాధిని కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. సంచార జాతుల వారి పిల్లలకు ప్రత్యేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు.

మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10వేలను ఇస్తామన్నారు. మత్య్సకారులు వేట సమయంలో చనిపోతే రూ.10 లక్షలను ఇస్తామన్నారు. కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. పాత బోట్లను గుర్తిస్తామన్నారు. డీజీల్ పట్టే సమయంలోనే సబ్సీడీ అందేలా చర్యలు తీసుకొంటామన్నారు.

ఇంట్లో మగ్గం ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రూ.2వేలను పెట్టుబడి కింద ఇస్తామన్నారు.సహకార డెయిరీలకు లీటరు పాలకు సబ్సీడీ కింద రూ.4 ఇస్తామని చెప్పారు. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6వేలను ఇస్తామన్నారు. తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కును యాదవులకే కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న నాయీబ్రహ్మణులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకొంటామని జగన్ చెప్పారు. ప్రధాన ఆలయాల్లోని బోర్డుల్లో నాయీ బ్రహ్మణులు, యాదవులకు చోటు కల్పిస్తామని చెప్పారు.

పేదలు మరణిస్తే ప్రతి ఒక్కరికి రూ.7 లక్షలను ప్రమాద భీమా అందిస్తామన్నారు. అప్పులు తాళలేక ఆత్మహత్యలు చేసుకొంటే కూడ రూ.7 లక్షలను ఇస్తామన్నారు.మరో వైపు బలవంతంగా అప్పులు వసూలు చేయాలని చూడకుండా చట్టం తెస్తామని జగన్ హామీ ఇచ్చారు.

ఎన్నికలు రెండు మాసాలున్నాయనగానే తాను ప్రకటించిన పథకాలను చంద్రబాబునాయుడు కాపీ కొట్టారని వైసీపీ చీప్ వైఎస్ జగన్ విమర్శించారు.నిస్సిగ్గుగా బాబు తన మేనిఫెస్టోను కాపీ కొట్టారని చెప్పారు. పెన్షన్ల పెంపు, ట్రాక్టర్లపై పన్ను రాయితీ వంటి అంశాలను తాము ప్రకటించిన అంశాలనే  చంద్రబాబునాయుడు కాపీ కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
 

సంబంధిత వార్తలు

కురుక్షేత్రం చివరి రోజు, బీసీలంటే భారత్ కల్చర్: జగన్