ఏలూరు: ఇవాళ కురుక్షేత్రం చివరి రోజు మాదిరిగా కన్పిస్తోందని  వైసీపీ చీప్ వైఎస్ జగన్ చెప్పారు. బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. భారత్ కల్చర్  అని జగన్ అభిప్రాయపడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ఆదివారం నాడు నిర్వహించిన బీసీ గర్జన సభలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తాను పాదయాత్రలో ఉన్న సమయంలోనే బీసీల సమస్యలను తెలుసుకొనేందుకు బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి నివేదికలను తెప్పించుకొన్నట్టు  జగన్ చెప్పారు. 

 పాదయాత్ర సమయంలో తాను బీసీల సమస్యలను  స్వయంగా తెలుసుకొన్నట్టు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల జీవితాల్లో వెలుగులు నింపుతామని  ఆయన చెప్పారు. 

అభివృద్ధి, ఆదాయపరంగా  బీసీలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నారని చెప్పారు. బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు, జాతికి వెన్నెముక అంటూ జగన్ చెప్పారు. భారతీయ సంస్కృతిలో అణువణువూ కూడ బీసీలేనన్నారు.

ఫీజు రీ ఎంబర్స్ మెంట్‌ను ముష్టి వేసినట్టు రూ.30 లేదా రూ.35వేలను ఇస్తున్నారన్నారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ కింద రూ.2,200 కోట్లు బకాయిలను  ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. పిల్లల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలకు  ఉన్నత విద్యను అందించాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.

ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో చంద్రబాబునాయుడు పీహెచ్‌డీ చేశారని జగన్ విమర్శించారు. బీసీలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలోని మూడు మాసాల్లో బీసీలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు.