అమరావతి: అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నియమించింది. అంతర్వేది దేవాలయానికి చెందిన రథం దగ్ధం కావడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.

అంతర్వేదిలో గతంలో ఈవోగా పనిచేసిన అధికారిని బదిలీ చేసి ఆయన స్థానంలో కొత్త వారిని నియమించారు. రథం దగ్ధం కావడంపై హిందూ సంఘాలు, వీహెచ్‌పీ, బీజేపీ, జనసేనలు ఆందోళనలకు దిగాయి. 

అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది.

దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ను స్పెషలాఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు  జారీ చేశారు. అంతర్వేదిలో పరిస్థితిని పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ కమిషనర్ ను ఆదేశించారు.

15 రోజుల పాటు అంతర్వేదిలోనే ఉండాలని రామచంద్రమోహన్ ను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త రథం నిర్మాణంతో పాటు పరిస్థితులు కొలిక్కి తీసుకురావాలని సూచించింది.

ఈ నెల 5వ తేదీ రాత్రి రథం అగ్నికి ఆహుతైంది. రాష్ట్రంలో పలు దేవాలయాల్లో ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న ఘటనలను బీజేపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.