అమరావతి:రాష్ట్రంలో ప్రజలకు పెద్ద మొత్తంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కొత్త పద్దతిని అమల్లోకి తీసుకొచ్చినట్టుగా ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ రెడ్డి ప్రకటించారు.

గురువారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,555 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా ఆయన తెలిపారు.

ఇవాళ్టి నుండి ట్రూనాట్ కిట్స్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా జవహర్ రెడ్డి తెలిపారు. ప్రతి పదిలక్షలమందిలో 331 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవాళ ఒక్కరోజే మూడువేల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు.
also read:ఏపీలో విద్యుత్ సంస్థల్లో ఆరు మాసాల పాటు సమ్మెలపై నిషేధం

లక్ష ట్రూనాట్ కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. ట్రూనాట్ కిట్లను 13 జిల్లాలోని 49 సెంటర్లకు పంపామన్నారు. గ్రామాల్లోని వలంటీర్లు, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా మూడు దఫాలు ఇంటింటికి సర్వే నిర్వహించినట్టుగా ఆయన తెలిపారు

అయితే వీరిలో సుమారు 32,700 వేల మందికి జ్వరంతో పాటు జులుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నట్టుగా తేలిందన్నారు. వచ్చే మూడు రోజుల్లో వీరందరికీ కరోనా టెస్టులు నిర్వహించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

ప్రతి రోజూ మూడు వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి రోజూ 17 వేల మందికి పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.