ఏలూరు:  వచ్చే ఏడాది మే లోపుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే పనులను పరిశీలించారు.తొలుత చంద్రబాబునాయుడు  పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. స్పిల్ వే, కాపర్ డ్యామ్ పనుల పురోగతి గురించి  చంద్రబాబునాయుడు వాకబు చేశారు.

ఏపీ ప్రజల చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్టు అని ఆయన గుర్తు చేసుకొన్నారు. 70.17 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 40 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంటుందన్నారు.

80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు, 24 టీఎంసీలు విశాఖలో పరిశ్రమల కోసం కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులు చేయాలన్నారు.

పోలవరం కుడి కాలువ 178 కి.మీ ఎడమ కాలువ 211 కి.మీ ఉంటుందన్నారు. 48 గేట్లను ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేశామన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు. 50 లక్షల క్యూసెక్కుల నీటిని కూడ విడుదల చేసేందుకు వీలుగా  ప్రాజెక్టును డిజైన్ చేసినట్టుగా బాబు చెప్పారు.

 కాపర్ డ్యామ్‌లో 52 శాతం పని పూర్తైందన్నారు. 16వేల493 కోట్ల ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో సుమారు 5 వేలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కేంద్రం నుండి ఇంకా 4 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందన్నారు.కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందుకు వెళ్తోందన్నారు. పోలవరం పూర్తైతే కరువును జయించినట్టేనన్నారు.