విశాఖపట్నం: విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి రాజేశ్వరిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ఆస్పత్రిలో ఆమెకు అందుతున్న వైద్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

రాజేశ్వరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజేశ్వరి బాధ్యతతోపాటు బిడ్డ బాధ్యత కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. రాజేశ్వరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజేశ్వరి కడుపులోని బిడ్డ సురక్షితంగా ఉందని ఆమె తెలిపారు. 

గర్భిణి అని చూడకుండా రాజేశ్వరి కడుపుపై ఆమె అత్త కాలుతో తన్నడం దుర్మార్గమన్నారు. నిండు చూలాలు అని కూడా చూడకుండా కాలుతో తన్ని గాయపరుస్తుందా అంటూ మండిపడ్డారు. తల్లి దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిన భర్త తల్లికి సహకరించడం బాధాకరమన్నారు. 

చేతిమణికట్టుపై చాకుతో దాడి చేశాడని అదృష్టం బాగుండి ఆమె వారి బారి నుంచి బయపడిందన్నారు. అదనపు కట్నం కోసం చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేశ్వరిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన భర్త, అత్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని నన్నపనేని రాజకుమారి చెప్పారు.