విజయవాడ:ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశ్యంతోనే కార్పోరేషన్లను ఏర్పాటు చేసినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్టుగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలో లేనే లేదన్నారు. సగం మంది మహిళలకు పదవులు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా అని ఆయన ప్రశ్నించారు.

మహిళా అభ్యదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టినట్టుగా ఆయన చెప్పారు. కార్పోరేషన్ల ఏర్పాటుతో బలహీనవర్గాలను బలపరుస్తున్నామన్నారు. కార్పోరేషన్లతో 50 శాతం స్థానాలను మహిళకు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇది మహిళల అభ్యున్నతికి నాందిగా నిలవనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కార్పోరేషన్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

గత టీడీపీ ప్రభుత్వం బీసీల కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రూ. 19 వేల కోట్లే ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు సర్కార్ కార్పోరేషన్లను నిర్వీర్యం చేసిందన్నారు. 

బలహీనవర్గాలను బలపర్చడంలో మరో అడుగు ముందుకు వేసినట్టుగా ఆయన చెప్పారు. కేబినెట్ లో కూడా బీసీలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు.గ్రామ వలంటీర్ల వ్యవస్థలోనూ 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని ఆయన చెప్పారు. బీసీలంటే మన సంస్కృతికి, సంప్రదాయానికి వారుధులని ఆయన చెప్పారు.

గత 18 నెలలుగా తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను  జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు వెన్నెముక కులాలు అని ఆయన చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం వరకు నెరవేర్చినట్టుగా ఆయన చెప్పారు. 18 నెలల్లోనే బీసీల అభివృద్దికి రూ. 38,519 కోట్లను ఖర్చు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఇప్పటివరకు తమ ప్రభుత్వం 4.45 కోట్ల మంది బీసీలకు లబ్ది చేకూర్చినట్టుగా ఆయన తెలిపారు.

ఇళ్ల పట్టాల పంపిణీ కోసం యుద్దమే చేశామన్నారు. ఈ నెల 25న రాష్ట్రంలోని 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్టుగా సీఎం చెప్పారు.