అమరావతి: రాష్ట్రంలో 4.01 లక్షల  శాశ్వత ఉద్యోగాలను కల్పించేందుకు శ్రీకారం చుట్టనున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదొక రికార్డుగా నిలిచిపోనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించనున్నట్టుగా జగన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నాడు జగన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చేందుకు నాంది పలుకుతున్నామని జగన్ ట్వీట్ చేశారు.

ప్రజల ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమని  జగన్ అభిప్రాయపడ్డారు.  ఎన్నికల సమంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు. ఈ హమీ మేరకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక్క గ్రామ వలంటీర్ ఉంటారు. గ్రామ వలంటీర్ లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేస్తారు. ప్రస్తుతం గ్రామ వలంటీర్ల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.

గ్రామ వలంటీర్లు ఎవరైనా అవినీతికి పాల్పడితే నేరుగా  తనకే ఫిర్యాదు చేయాలని ఏపీ సీఎం జగన్ ప్రజలను కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజుతో పాటు ప్రతి సందర్భంలో ఈ విషయాన్ని జగన్ చెబుతున్నారు. సీఎం కార్యాలయంలో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఓ నెంబర్ ను ఏర్పాటు చేస్తామని  జగన్  ప్రకటించారు.