విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరాం: విజయసాయిరెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై ప్రధానితో చర్చించేందుకు గాను అపాయింట్ మెంట్ కోరినట్టుగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై ప్రధానితో చర్చించేందుకు గాను అపాయింట్ మెంట్ కోరినట్టుగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
మంగళవారం నాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు మద్దతుగా ఈ నెల 20న పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రగా ఈ యాత్రకు పేరు పెట్టినట్టుగా ఆయన చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని ప్రధానిని కోరుతామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇందుకోసం ప్రధాని అపాయింట్ మెంట్ కోరినట్టుగా ఆయన తెలిపారు. ప్రధాని అపాయింట్ లభించగానే స్టీల్ ప్లాంట్ ప్రజల సెంటిమెంట్ గురించి వివరిస్తామని ఆయన తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికార, విపక్షాలు కార్మికుల ఆందోళనలకు మద్దతుగా నిలిచారు.టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.