పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన రిపోర్టును బయటపెట్టాల్సిందేనని చెప్పారు పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి. ఎక్కువ మంది ఉద్యోగులు సంతోషపడేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందనే ఆశాభావంతో ఉన్నామని వెంకట్రామిరెడ్డి అన్నారు.

తమ సమస్యల సాధనలో పట్టువిడుపులకు తాము సిద్ధమని పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని .. ఈ అంశాలన్నీ ఒకదానితో మరొకటి లింక్ అయి ఉన్నాయని ఆయన చెప్పారు. కొన్నింటిలో ప్రభుత్వం, మరికొన్నింటిలో తాము సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల పీఆర్సీ పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన రిపోర్టును బయటపెట్టాల్సిందేనని చెప్పారు. ఎక్కువ మంది ఉద్యోగులు సంతోషపడేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందనే ఆశాభావంతో ఉన్నామని వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ఈరోజు సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నామన్నారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం (PRC Issue) కొనసాగుతుంది. ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న తరుణంలో వారి అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ప్రయత్నాలు చేస్తుంది. ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ విజయవంతం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులు సమ్మెకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే భావనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తొలుత డీజీపీతో సమావేశమయ్యారు. చలో విజయవాడపై ఆయన ఆరా తీసినట్టు సమాచారం. 

అనంతరం ఉద్యోగులతో సంప్రదింపుల కోసం ఏర్పాటైన మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ‌లతో కూడిన కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి.. కొన్ని వెసులుబాట్లు కల్పించడం ద్వారా ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూడాలని సీఎం జగన్ మంత్రుల కమిటీని ఆదేశించారు. అనంతరం మంత్రుల కమిటీ నుంచి పీఆర్‌సీ సాధన సమితి (PRC Steering Committee) నాయకులకు ఆహ్వానం అందింది. 

ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. పీఆర్సీ, ఐఆర్, హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు.. తదితర అంశాలపై మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నాయకులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో కొన్నింటిపై స్పష్టమైన హామీ లభించగా.. మరికొన్నింటిపై అస్పష్టత నెలకొంది. ఐఆర్‌ను వేతనాల నుంచి రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ లభించింది. ఇదిలా ఉంటే.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దుపై మాత్రం ఎలాంటి హామీ లభించలేదు.

ఈ నేపధ్యంలో పీఆర్సీపై (prc) చర్చించేందుకు మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ (prc steering committee) శనివారం సమావేశమైంది. ఏపీ సచివాలయంలోని బ్లాక్ నెంబర్ 2లో ఆర్ధిక శాఖ మీటింగ్ హాల్‌లో సమావేశం జరుగుతోంది. హెచ్ఆర్ఏ (hra) అలాగే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబ్‌లు, సీసీఏ రద్దు (cca) , మట్టి ఖర్చులు వంటి అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మీటింగ్ తర్వాత పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సీఎం జగన్‌తో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.