జమ్మలమడుగు: తమ పార్టీకి ఓటేయని వారు కూడ వచ్చే ఎన్నికల్లో ఓటేసేలా పనులు  చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను అన్నివర్గాలకు అందేలా చర్యలు తీసుకొంటామని ఆయన స్పష్టం చేశారు.

 రైతు దినోత్సవం కార్యక్రమంలో సోమవారం నాడు జమ్మలమడుగులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ పెన్షన్‌ను వెయ్యి నుండి రూ.2250కు పెంచినట్టుగా ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెల రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కంటే మూడు రెట్లు అధికంగా  పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్టుగా జగన్ చెప్పారు.2014-15లో పెన్షన్ కోసం రూ.3375 కోట్లు 2015 -16 లో 5221 కోట్లు, 2016-17 లో 5270 కోట్లు, 2017-18లో 5436కోట్లు, 2018-19లో 8234 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ కోసం రూ.15వేల కోట్లను ఖర్చు చేసినట్టుగా జగన్ చెప్పారు.

పెన్షన్ మంజూరు కోసం  ఎలాంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు.గతంలో మాదిరిగా లంచం ఇవ్వనిదే పని జరగని  పరిస్థితులు ఇక ఉండవన్నారు. ఇక నుండి నేరుగా మీ ఇంటికే నేరుగా వచ్చి  పెన్షన్లను చెల్లించనున్నట్టుగా సీఎంగా చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి  పెన్షన్లు నేరుగా అందుతాయన్నారు.

గ్రామ వాలంటీర్ల ద్వారా  పెన్షన్లు నేరుగా లబ్దిదారులకే చెందుతాయని ఆయన చెప్పారు. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడితే వెంటనే తొలగిస్తామన్నారు. గ్రామ వాలంటీర్  అవినీతిపై నేరుగా సీఎం కార్యాలయానికి కూడ ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్దిదారుడికి అందేలా చేస్తామని సీఎం చెప్పారు. తమ పార్టీకి ఓటేయని వారికి కూడ ఈపథకాలు వర్తింపజేస్తామన్నారు. ఈ ఏడాది రైతుల పంట రుణాల కోసం రూ. 84 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టుగా జగన్ చెప్పారు. రైతులకు సున్నా వడ్డీకే రుణాలను ఇస్తామన్నారు. ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టుగా ఆయన తెలిపారు.

రైతాంగానికి పగటిపూట 9 గంటలపాటు విద్యుత్ ను ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొన్నట్టుగా ఆయన గుర్తు చేశారు. అక్వా రైతాంగానికి రూ. 1.50 చొప్పున విద్యుత్ ను అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.వైఎస్ఆర్ పంటల భీమా పథకానికి శ్రీకారం చుట్టినట్టుగాసీఎం చెప్పారు.  

ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ, చంద్రబాబునాయుడు మాత్రం విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.