నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తే తప్ప సమస్య తగ్గేట్లు లేదు.
ఇంకా చలికాలం పూర్తిగా పోకుండానే రాష్ట్రవ్యాప్తంగా అప్పుడే నీటికి కటకట మొదలైపోయింది. వర్షాలు సరిగా పడకపోవటం, పడిన వర్షాలు కూడా భూగర్భంలోకి ఇంకని కారణంగా నీటి ఎద్దడి ప్రభావం కనబడుతోంది. వ్యవసాయానికే కాదు త్రాగునీటికి కూడా సమస్యలు మొదలయ్యాయి. చెరువులు ఎండిపోతున్నాయి, బావులు, బోరుబావులు సైతం చాలా వరకూ అడుగంటుతున్నాయి. ఫలితంగా ఇటు పల్లెలతో పాటు అటు మున్సిపాలిటీల్లో కూడా మంచినీటికి సమస్యలు పడుతున్నారు.
ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలోని 1562 సమ్మర్ స్టోరేజి ట్యాంకుల్లో ఇప్పటికే దాదాపు 100 అడుగంటాయి. మరో 500 ట్యాంకుల్లో నెలకన్నా నీళ్ళురావటని అధికారులే చెబుతున్నారు. 667 మండలాల్లోని 6775 నివాసిత ప్రాంతాల్లో వేసవిలో నీటి ఎద్దడి తప్పదని అంచనా. అదేవిధంగా 110 మున్సిపాలిటీల్లోని 850 ప్రాంతాల్లో అప్పుడే కరువు ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా మురికివాడల్లో నివసించే వేలాదిమందికి వారంలో నాలుగు రోజులు మాత్రమే నీరు అందుతోంది.
పురపాలక శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలోని 34 వేల బోర్లలో సుమారు 16వేల బోర్లు ఇప్పటికే ఎండిపోయాయి. అనంతపురం, కడప, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు లాంటి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రెండు రోజులకోసారి మంచినీటి సరఫరా అవుతోంది. వేసవి మొదలుకాకముందే పరిస్ధితి ఈ విధంగా ఉంటే ఇక వేసవిలో ఎలాగుంటుందోనంటూ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇదే అదునుగా ప్రైవేటు సంస్ధల నీటి వ్యాపారం మాత్రం మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇటు వ్యవసాయానికీ నీరు అందక, అటు త్రుగునీటకీ కటకటలు మొదలైతే ప్రజల అవస్తలు చెప్పనలవి కాదు. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తే తప్ప సమస్య తగ్గేట్లు లేదు.
