అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో బుధవారం నాడు గందరగోళ వాతావరణం నెలకొంది.  అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ చైర్మెన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రకటించారు.

సోమవారం నాడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. మంత్రులు ఇష్టానుసారం మాట్లాడితే  ఎలా అని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. మండలికి మంత్రులు తన్నడానికే వస్తారా అని టీడీపీ ఎమ్మెల్సీలు  ప్రశ్నించారు.

మంత్రులతో కొట్టించుకోవడానికి సభకు వస్తారా అని అధికార పార్టీ సభ్యులను ఉద్దేశించి  టీడీపీ సభ్యలు వ్యాఖ్యానించారు.మంత్రులను రౌడీలంటూ ఎలా సంబోధిస్తారు మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు.

ఈ విషయమై రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ చైర్మెన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రకటించారు. సభలో తాను అవకాశమిచ్చినవారే మాట్లాడాల్సిందిగా కోరారు. అధికార పార్టీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు.