అమరావతి: టీడీపీలో ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు.

స్వంత పార్టీల నేతలపైనే కాదు ప్రత్యర్థి పార్టీల నేతలపై కూడ విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా  విమర్శలు గుప్పిస్తున్నారు.లోక్‌సభ‌లో టీడీపీ విప్  పదవిని తిరస్కరిస్తున్నట్టుగా ఫేస్‌బుక్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించి కేశినేని నాని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

 

ఆ తర్వాత కూడ ఇదే పద్దతిలో కేశినేని నాని తన అసంతృప్తిని వెలిబుచ్చారు. స్వంత పార్టీలో చోటు చేసుకొన్న  పరిణామాలపైనే కాదు ప్రత్యర్థి పార్టీల నేతలపై కూడ సోషల్ మీడియా వేదికగానే తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

తాజాగా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తీవ్రమైన విమర్శలు గుప్పించారు.నాలుగు పదాలు రాయలేనివాడు.. నాలుగు వ్యాక్యాలు చదవలేని వాడికి నాలుగు పదవులా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడ కౌంటరిచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో నాయకుడికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర పార్టీలతో కలిసి పార్టీని కూల్చేవాడు ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. నీ మాదిరిగానే అవకాశవాదుల వల్ల పార్టీకి నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

విజయవాడ పట్టణంలో నాగుల్ మీరాను అక్కున చేర్చుకొని తనను దూరం పెట్టడంపై బుద్దా వెంకన్న కేశినేని నానిపై అసంతృప్తితో ఉన్నాడని చెబుతున్నారు. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే నాని బుద్దా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు తలనొప్పి: నాని వర్సెస్ బుద్దా వెంకన్న