కర్నూల్ :ఏవీ సుబ్బారెడ్డికి తమకు మధ్య వ్యక్తిగతంగా గ్యాప్ వచ్చిందని మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ చెప్పారు. ఈ కారణంగానే ఆయన తమ మీద నిందలు వేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం నాడు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డకు వచ్చి రాజకీయాలు చేస్తే స్వాగతిస్తానన్నారు.తన భర్తకు నోటీసులు రావడంతో ముందస్తు బెయిల్ కు ధరఖాస్తు చేసినట్టుగా ఆమె చెప్పారు.

పోలీసులు తనను ఏ 4 నిందితురాలుగా పరిగణించలేదని ఆమె వివరించారు. సుబ్బారెడ్డికి తమకు మధ్య ఆర్ధిక లావాదేవీలు లేవని ఆయనే ఒప్పుకొన్నారని ఆమె గుర్తు చేశారు.  పోలీసుల విచారణకు తాను ఎప్పుడైనా స్వాగతిస్తానని చెప్పారు.

also read:కూతురిలా పెంచాను, నన్ను చంపేందుకు సుపారీ: భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలనం

తనను చంపేందుకు భూమా అఖిలప్రియ,ఆమె భర్త భార్గవ్ రామ్  లు సూడో నక్సలైట్ సంజూకు రూ. 50 లక్షలు సుఫారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఈ నెల 4వ తేదీన ఆరోపించిన విషయం తెలిసిందే.

ఏవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె కౌంటరిచ్చారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఏవీ సుబ్బారెడ్డి ఎందుకు అధికార పార్టీపై విమర్శలు చేయడం లేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.ఈ సమయంలో టిక్కెట్టు విషయమై ఎందుకు ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడారో చెప్పాలని ఆమె కోరారు.