వైసీపీ నేత దారుణ హత్య .. పల్నాడులో వేడెక్కిన రాజకీయం , యరపతినేని-కాసు మహేశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
గురజాల మండలం జంగమహేశ్వరపురంలో వైసీపీ నేత కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని కాసు మహేశ్ రెడ్డి ఆరోపించారు .

పల్నాడు జిల్లా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గురజాల మండలం జంగమహేశ్వరపురంలో వైసీపీ నేత కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కృష్ణారెడ్డి హత్యను ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఖండించారు. చట్ట ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలని.. టీడీపీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని కాసు మహేశ్ రెడ్డి ఆరోపించారు . ఈ హత్య కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆ వెంటనే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. కృష్ణారెడ్డి హత్యకు వివాహేతర సంబంధం, స్థానికంగా వున్న వివాదాలే కారణమని ఆయన పేర్కొన్నారు. కాసు మహేశ్ రెడ్డి వచ్చిన తర్వాతే గురజాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగాయని.. టీడీపీ కార్యకర్తలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లేలా చేశారని యరపతినేని ఆరోపించారు. తనపై హత్య కేసు నమోదు చేయించేందుకు మహేశ్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని, వీటికి భయపడే ప్రసక్తే లేదని శ్రీనివాసరావు తెలిపారు.
కాగా.. కూనిరెడ్డి కృష్ణారెడ్డిని ప్రత్యర్ధులు వేట కొడవళ్లతో నరికి చంపారు. గ్రామానికే చెందిన పరమేశ్వర రెడ్డికి , కృష్ణారెడ్డికి మధ్య గొడవలు వున్నాయి. ఈ క్రమంలో కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో వుంటున్నారు. అయితే దసరా పండుగ కావడంతో స్వగ్రామానికి వచ్చిన ఆయనను ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.