చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖాలో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపుల ఘటనపై సీరియస్ అయ్యారు. సొంత నియోజకవర్గమైన కుప్పం మండలం తహాశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా అటెండర్ భవ్యను వీఆర్ఏ ఆనంద్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

దీంతో బాధితురాలు భవ్య జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది . అటు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అంతేకాదు మీడియా ఎదుట తన ఆవేదనను వెల్లబుచ్చింది. ఈ ఘటన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. కోల్ కత్తా పర్యటనలో ఉన్న సీఎం ఘటనపై సీరియస్ అయ్యారు. 

వాస్తవాలు తెలుసుకుని విచారించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం వీఆర్ఏ ఆనంద్ ను సస్పెండ్ చేసింది.  

శనివారం ఉదయం చిత్తూరు జిల్లా కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో తనను వీఆర్ఏ వేధిస్తున్నాడని మహిళా అటెండర్ జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తన ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 

తన లైంగిక వాంఛ తీర్చకుంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని అతని వేధింపులు తట్టుకోలేక అటెండర్ భవ్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ ను కలిసి తన గోడు వెల్లబోసుకుంది. 

అనంతరం మీడియాను ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంతో చంద్రబాబు  సీరియస్ అయ్యారు. దీంతో నిందితుడు ఆనంద్ పై సస్పెండ్ వేటు పడింది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు ఇలాఖాలో గొడవ: అటెండర్ పై వీఆర్ఎ లైంగికవేధింపులు