తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేయడానికి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ బూత్ లో జరిగే ప్రాసెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒటర్ కు వుంది.
అమరావతి : ఆంధ్ర ప్రదేలో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలతో కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓటర్లు మరీముఖ్యంగా తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోడానికి సిద్దమైన యువతీయువకులు ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఓటు వేసెందుకు ఇంటినుండి బయలుదేరింది మొదలు ఓటేసి ఇంటికి వచ్చేవరకు ఈ సూచనలు పాటించండి... జాగ్రత్త వహించండి.
ఓటర్లకు సూచనలు, జాగ్రత్తలు :
1. ఓటు వేయడానికి ఓటరు స్లిప్ అవసరం. ఈ స్లిప్ లను ఈసీనే బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా ఇళ్లవద్దకే వచ్చి అందిస్తోంది. ఒకవేళ ఈ స్లిప్ అందుకున్నా ఎన్నికల సంఘం సూచించిన ఐడీ కార్డులను కూడా అనుమతిస్తారు.
2. ఎన్నికల సంఘం సూచించిన సమయం వరకు మాత్రమే ఓటు వేయడానికి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ప్రణాళికలు చేసుకోవాలి. వేసవికాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఉదయం, సాయంత్రం సమయంలో ఓటు వేయడానికి వెళితే మంచిది. మధ్యాహ్నం సమయంలో వెళ్ళేవారు ఎండల నుండి కాపాడుకునే జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వృద్దులు, వికలాంగులు మరింత జాగ్రత్తలు పాటిస్తూ ఓటేయడానికి వెళ్ళాలి.
3. మీ ఓటు ఏ ప్రాంతంలో ఉందో ముందుగానే తెలుసుకోవాలి. ఓటర్ స్లిప్ లో పోలింగ్ బూత్ వివరాలు వుంటాయి. ఈ స్లిప్ పై వుండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంద్వారా కూడా పోలింగ్ స్టేషన్ రూట్ మ్యాప్ ను తెలుసుకోవచ్చు.
4. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన వెంటనే మొదటి అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో మీ పేరు, సంబంధిత వివరాలు పరిశీలిస్తారు. రాజకీయ పార్టీల ఏజంట్స్ కూడా మీ వివరాలను సరిచూసుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే తర్వాత రెండో అధికారి వరకు పంపిస్తారు.
5. రెండో అధికారి తన వద్ద ఉన్న సిరాను మీ చూపుడు వేలికి అంటిస్తారు. దీనితో పాటు లిస్టులో ఉన్న మీ పేరుకు సంబంధించిన ఒక స్లిప్ ను మీకు అందిస్తారు.
6. అక్కడి నుంచి రెండో అధికారి మిమ్మల్ని మూడో అధికారి దగ్గరకు వెళ్లమని చెబుతారు. మూడో అధికారి మీ వద్ద ఉన్న స్లిప్ ను పరిశీలించి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఓటు వేసే ప్రాంతమైన ఈవీఎం దగ్గరకు పంపుతారు.
7. ఈవీఎంలో అభ్యర్థుల పేర్లు, ఫొటో, వారికి సంబంధించి గుర్తులు ఉంటాయి. వాటికి ఎదురుగా బటన్స్ ఉంటాయి. మీరు ఓటు వేయాలనుకున్న వ్యక్తి లేదా పార్టీ, గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ నొక్కి మీ ఓటును వేయాలి.
8. ఈవీఎం బటన్ నొక్కగానే ఆ బటన్ లోని లైట్ వెలుగుతుంది. అలాగే, బీప్ అని ఒక శబ్ధం వస్తుంది. దీంతో పక్కనే ఉన్న వీవీప్యాట్ లో మీరు ఓటువేసిన గుర్తుకు సంబంధించి వివరాలతో ఒక స్లిప్ కొన్ని సెకండ్ల పాటు కనిపించి కిందపడి పోతుంది.
9. మీరు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఈవీఎం బటన్ నొక్కగానే బీప్ అని సౌండ్ రాకపోయినా, బటన్ లైట్ వెలుగకపోయినా, వీవీప్యాట్ లో మీ ఓటుకు సంబంధించిన స్లిప్ రాకపోయిన అక్కడే ఉన్న అధికారికి వెంటనే సమాచారం అందించాలి.
10. పోలింగ్ బూత్ లోకి మొబైల్స్, ఇతర వస్తువులను అనుమతించరు. కాబట్టి వీటిని ఇంటివద్దే వదిలివెళ్ళడం మంచింది.
