విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ ఆందోళన చేపట్టింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో వున్న స్లిప్పులను అందజేశారు జేఏసీ నాయకులు. బ్యాలెట్‌తో పాటు సేవ్ విశాఖ స్లిప్పులను బాక్స్‌లో వేయాలని కోరారు.

అయితే ఈ స్లిప్‌లకు అనుమతి లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. బ్యాలెట్‌తో పాటు స్లిప్పులను బాక్స్‌లో వేస్తే ఓటు చెల్లదని స్పష్టం చేశారు. ఎవరైతే భూములను కోల్పోయి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేశారో ఆ కాలనీలలో వున్న ప్రజలంతా ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. అయితే కొందరు ఆ స్లిప్పులను బ్యాలెట్ బాక్స్‌లో వేసినట్లుగా తెలుస్తోంది. 

Also Read:విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: కేటీఆర్

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం రాష్ట్రంలోని 71 మున్సిపాలిటీలు, 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మాచర్ల, పుంగనూరు, పిడుగురాళ్ల, పులివెందుల మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో ఏకగ్రీవమయ్యాయి.

71 మున్సిపాలిటీల్లో 1633 వార్డులకు పోలింగ్ జరిగింది. 12 కార్పోరేషన్లలో 581 డివిజన్లకు పోలింగ్ జరిగింది.ఈ నెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపుగా పోలింగ్ కేంద్రాలలోని క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించారు అధికారులు. 4 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది.