త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనుకుంటున్న కారణంగా ఓట్ల క్యాంటిన్లను ఏర్పాటు చేస్తే ఉపయోగముంటుందని అధికార టిడిపి భావిస్తోంది.

వచ్చే సంక్రాంతి పండుగలోగా అన్న(ఓట్ల)క్యాంటిన్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో ఎన్నికలు జరుగుతాయనుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పరిధిలో క్యాంటిన్లు ఏర్పాటవనున్నాయి. మొదటి దశలో 100 క్యాంటిన్ల ప్రారభాంనికి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించటం గమనార్హం. అవికూడా ఏరికోరి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే ప్రారంభించాలని నిర్ణయించటం గమనార్హం.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నా అదిగో ఇదిగో అని క్యాంటన్ల ప్రారంభాన్ని నెట్టుకొస్తున్నది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనుకుంటున్న కారణంగా ఓట్ల క్యాంటిన్లను ఏర్పాటు చేస్తే ఉపయోగముంటుందని అధికార టిడిపి భావిస్తోంది.

ఒక రకంగా రాష్ట్రంలోని చాలా మంది అన్న క్యాంటిన్లను మరచిపోయారు కూడా. అయితే, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని ప్రభుత్వమే అప్పుడప్పుడు సమీక్షలు నిర్వహిస్తూంటుంది. అయితే, తాజాగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మాత్రం వీలైనంత తొందరలో క్యాంటన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, క్యాంటిన్లో వడ్డించే పదార్ధాలను ఏ రీతిలో అందించాలన్న విషయంలోనే తేడాలొచ్చినట్లు సమాచారం.

హోల్ మీల్ అందించాలని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ప్రతిపాదించగా, తమిళనాడు తరహాలో ఫాస్ట్ ఫుడ్ అందిస్తే బాగుంటుందని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. దాంతో ఎటు తేల్చుకోలేక మళ్లీ ఒకసారి తమిళనాడులో పర్యటించాలని ఉపసంఘం ఆదేశించింది.

హోల్ మీలంటే అన్నం, సాంబారు, కూర, మజ్జిగ విడివిడిగా అందించటం. అదే ఫాస్ట్ ఫుడ్ అంటే సాంబారన్నం, పెరగున్నం లాంటివి ముందుగానే సిద్ధం చేసుకుని అవసరమైన వారికి అందించటం. అధికారుల కమిటీ ఈనెలాఖరులోగా తమిళనాడుకు వెళ్ళి పరిశీలన జరిపి నివేదిక సమర్పించాలని కూడా మంత్రులు చెప్పారు.

అధికారులు ఇచ్చిన నివేదికను ఉపసంఘం పరిశీలించి అవసరమైన మార్పలు, చేర్పులు చేసి ముఖ్యమంత్రికి అందిస్తుంది. బహుశా డిసెంబర్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో అన్న క్యాంటన్ల అంశంపై చర్చిస్తారు. జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా 100 క్యాంటిన్లూ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

మొదటి దశలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం, రాజాం, నెల్లిమర్ల, ఒంగోలు, కందుకూరు, కర్నూలు, అనంతపురం, హిందుపురంలో మొత్తం 100 క్యాంటిన్లను ఏర్పాటు చేయాలని ఉప సంఘం నిర్ణయించింది.