ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి - ఈసీ
ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేయొద్దని, డీఎస్సీ పరీక్షలను నిర్వహించకుండా వాయిదా వేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాలకు సంబందించిన ఆదేశాలు తమ కార్యాలయానికి అందాయని చెప్పారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం..
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. వాలంటీర్ల ద్వారా పింఛన్లు, ఇతర ఏ పథకాల లబ్దిదారులకు కూడా నగదును పంపిణీ చేయించకూడదని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ఇతర డివైజ్లను వెంటనే సంబందిత జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని చెప్పారు. ప్రభుత్వం పథకాలను ప్రత్యామ్నయ మార్గాల ద్వారా కొనసాగించాలని, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు పర్చాలని సూచించినట్లు ఆయన తెలిపారు.