ఓ వాలంటీర్ ఇద్దరు మహిళలపై దాడికి దిగిన ఘటన మదరపల్లెలో చోటుచేసుకుంది. 

మదనపల్లె : వైసిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థపై దుమారం రేగుతున్న సమయంలో ఓ వాలంటీర్ దారుణానికి పాల్పడ్డాడు. ప్రజాసేవ చేయాల్సిన వాలంటీర్ ఇద్దరు మహిళలపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. పించన్ ఇచ్చే సమయంలో లంచం అడిగితే ఇవ్వలేదని కక్షగట్టిన వాలంటీర్ దాడికి పాల్పడినట్లు బాధితులు వాపోతున్నారు. 

బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన వాలంటీర్ మహేష్, చంద్రశేఖర్ గొడవపడ్డారు. తన బావమరిది చెడిపోడానికి మహేష్ కారణమని చంద్రశేఖర్ మందలించడానికి ప్రయత్నించడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో వాలంటీర్ తో పాటు అతడి కుటుంబసభ్యులు మూడ్రోజుల క్రితం చంద్రశేఖర్ తో గొడవపడి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి పంపించారు. 

అయితే ఆదివారం వాలంటీర్తో పాటు అతడి కుటుంబసభ్యులు మరోసారి చంద్రశేఖర్ భార్య గౌతమి(27) తో గొడవకు దిగారు. కోడలిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్త కృష్ణమ్మ(70)పై దాడిచేసారు. ఈ గొడవ సమయంలో చంద్రశేఖర్ ఇంటివద్ద లేడు. విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన తల్లి, భార్యను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ గొడవలో వాలంటీర్ భార్య కవితకు కూడా గాయాలవడంతో ఆమెను కూడా హాస్పిటల్ కు తరలించారు. 

Read More భర్త అంత్యక్రియలకు వచ్చి.. అత్తింటివారి చేతిలో భార్య మరో ఇద్దరు అనుమానాస్పద మృతి...

అయితే వాలంటీర్ మహేష్ పించన్ డబ్బులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసాడని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. రూ.200 వందలు ఇవ్వనందుకు వాలంటీర్ తమపై కక్ష పెంచుకున్నాడని... అందువల్లే తమతో గొడవకు దిగాడని అంటున్నాడు. వాలంటీర్ నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని చంద్రశేఖర్ కోరుతున్నాడు.