విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయక తప్పదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించిన నేపథ్యంలో కార్మికులు భగ్గుమన్నారు. స్థానిక కూర్మన్నపాలెం మెయిన్‌గేట్ వద్ద వున్న రహదారిపై కార్మికులు ఆందోళనకు దిగారు.

స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ డిమాండ్ చేస్తూ.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వీరి ఆందోళనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 

కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని తెలిపింది. స్టీల్ ప్లాంట్‌లో వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని స్పష్టం చేసింది.

మెరుగైనప ఉత్పాదకత కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నిర్మల సమాధానం తెలిపారు. ప్రైవేటీకరణతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.