Asianet News TeluguAsianet News Telugu

vizag steel plant privatization: మరో పోరాటానికి సిద్ధమవుతున్న విశాఖ.. ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్

స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఉద్యోగులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడితో పాటు.. రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వనున్నట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వెల్లడించింది

vizag steel plant employees call for ap bandh
Author
Visakhapatnam, First Published Jan 23, 2022, 5:54 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (vizag steel plant privatization) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి ఫిబ్రవరి 13వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఉద్యోగులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడితో పాటు.. రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వనున్నట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వెల్లడించింది. ఈ రోజు జరిగిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమావేశంలో నేతలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఫిబ్రవరి 13న విశాఖలో ఉన్న బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన కమిటీ.. ఫిబ్రవరి 23న విశాఖ నగరంతో పాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్షలు చేపట్టామని వెల్లడించారు. 150 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కరోనా వల్ల చనిపోయారని ఆయన గుర్తుచేశారు. నిరసనలు.. కరోనా వంటి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్‌కు రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని నరసింగరావు అన్నారు. వచ్చే నెల 13వ తేదీ ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 365 జెండాలతో బీజేపీ కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ చేపట్టి.. 23వ తేదీ విశాఖతో పాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ.. 16,500 కుటుంబాల త్యాగం స్టీల్ ప్లాంట్ వెనుక ఉందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమం జరుగుతుంటే.. ' స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం.. లేదా తీసేస్తాం' అని కేంద్రం చెబుతుండటంతో దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన పెట్టుబడి తప్ప బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని రాజశేఖర్ మండిపడ్డారు. కరోనా (coronavirus) సెకండ్ వేవ్ సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ అందించి ఎంతోమంది ప్రాణాలను స్టీల్ ప్లాంట్ నిలిపిందని ఆయన గుర్తు చేశారు. దీపం పేరు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని అనుకున్నారో.. ఆ పథకంతోనే బీజేపీ (bjp) దీపం ఆరిపోవడం ఖాయమంటూ రాజశేఖర్ జోస్యం చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios