Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ట్రాఫిక్ పోలీసుల రశీదుపై మతపరమైన కీర్తనలు ఉండటంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన పోలీసు శాఖ..!

విశాఖపట్నంలో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన రశీదుపై మతపరమైన కీర్తనలు ఉండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. 

Vizag Police Clarity on Communal slogans on traffic police tokens
Author
First Published Nov 26, 2022, 10:21 AM IST

విశాఖపట్నంలో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన రశీదుపై అన్యమత కీర్తనలు ఉండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. వివరాలు.. విశాఖ రైల్వే స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసు నిర్వహించే ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ఇచ్చే ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లపై ఒక మతానికి సంబంధించిన కీర్తనలు ముద్రించి ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు విశాఖ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడికి వెళ్లి ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే దీనిపై విశాఖ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పోలీసు సిబ్బంది నిర్వహించే ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లు శుక్రవారం అయిపోవడంతో గమనించకుండా పొరపాటున వేరే టోకెన్లు ఇవ్వడం జరిగిందని నగర పోలీసు శాఖ తెలిపింది. కొత్త టోకెన్లు తీసుకురావాలని ప్రీపెయిడ్ ఆటో సెక్రటరీకి అక్కడి సిబ్బంది చెప్పడంతో.. అతడు బైబిల్ వాక్యాలతో కూడిన టోకెన్లను తీసుకువచ్చారని చెప్పింది. అయితే అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అది గమనించకుండాలనే ప్రయాణికులకు టోకెన్లు ఇచ్చారు. అదే సమయంలో వచ్చిన తిరుమల ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు కూడా వాటిని ఇచ్చారని పేర్కొంది. అయితే ఇది పొరపాటున మాత్రమే జరిగిన పని అని.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సిబ్బంది ఆ టోకెన్ల పంపిణీ ఆపివేసినట్టుగా తెలిపింది. 

 

ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా కూడా విశాఖ పోలీసు శాఖ వివరణ ఇచ్చింది. పలువురు నెటిజన్లకు సమాధానమిచ్చిన సిటీ పోలీసులు.. ‘‘ఓ ఆటోడ్రైవర్‌ తన అజ్ఞానంతో దురదృష్టవశాత్తు హెడ్‌ కానిస్టేబుల్‌కు అందజేసిన స్లిప్పులను అత్యవసర పరిస్థితుల్లో పంపిణీ చేశాడు.  దృష్టికి వచ్చిన వెంటనే నిలిపివేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు’’ అని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios