విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరణించినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.  కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9) అనే ఇద్దరు చిన్నారులు ఘటనలో మరణించారు. చంద్రమౌళి (19 అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. గంగాధర్, నారాయణమ్మ, నరసమ్మ, గంగరాజు, కృష్ణ మూర్తి మరణించారు.విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. 

మృతుల సంఖ్య  9కి చేరిందని అధికారులు చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు చంద్రమౌళి విశాఖ పట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్‌ తొలి ఏడాదిలో చేరి చదువుకుంటున్నాడు. గ్యాస్‌ లీకైన ప్రాంతాల్లో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. .

మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏపీ సీఎం జగన్ పర్యటన అనంతరం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. అయితే, అనధికారిక లెక్కల ప్రకారం పది మంది మరణించినట్లు తెలుస్తోంది.

 సీరియస్ గా ఉన్నవారిని విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించారు. విశాఖపట్నంలోని వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో కంపెనీ ఉద్యోగులు ఎవరు కూడా మరణించలేదని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి చెప్పారు కాగా, ఉదయం 5.30లకే పరిస్థితి అదుపులోకి వచ్చిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు ప్రమాదానికి సంబంధించి డయల్ 100కు ఫోన్ వచ్చిందని చెప్పారు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఆ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఆ విషవాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది. బుధవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకైంది.మూగజీవులు కూడా దాని తీవ్రతకు గురై పడిపోతున్నాయి. మనుషులు అక్కడికక్కడే కుప్ప కూలిపోతున్న దృశ్యాలను కూడా కనిపిస్తున్నాయి.

విషయవాయువుతో చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలో, కడుపులో వికారం పుట్టడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లు వదిలేసి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీశారు. 

పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో విషవాయులు లీలకైనట్లు అధికారులు గుర్తించారు.