విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన అందరికీ ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే కరోనాతో విశాఖ నగరం అతలాకుతలమౌతుండగా.. ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ మరింత కలవరపెట్టింది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ... విష వాయువు రూపంలో కబలించింది. దాదాపు 12మంది ప్రాణాలు కోల్పోగా.. 2వేల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.

ఏం జరుగుతుందో కూడా తెలీని పరిస్థితిలో విశాఖ వాసులు కలవరపడిపోయారు. కళ్లు మంటలు, ఒంటిపై దురదలతో ఎక్కడివారు అక్కడే పడిపోయారు. అక్కడి ఘటనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేశాయి. తమ పిల్లలను కాపాడుకునేందుకు వారి తల్లిదండ్రులు భుజాలపై వేసుకొని పరిగెత్తిన సంఘటనలు చాలా మందిచేత కన్నీరు పెట్టించాయి.

కాగా... ఓ యువకుడు మాత్రం ఆ విష వాయువు నుంచి దాదాపు 25మంది ప్రాణాలు కాపాడాడు. దీంతో.. సదరు యువకుడిని సోషల్ మీడియా వేదికగా అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

గ్యాస్ లీకైన రోజు వెంకటాపురంకు చెందిన అశ్విని కుమార్ అనే యువకుడు 25మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు.. స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. సదరు యువకుడు ఆ సమయంలో పబ్జీ ఆడుతున్నాడట. నిద్రపోకుండా పబ్జీ ఆడటం వల్లనే అతను ఇప్పుడు అంత మంది ప్రాణాలు కాపాడటం విశేషం. అశ్వినికుమార్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు.

తన తండ్రి అప్పలనాయుడు ఎల్జీ పాలిమర్స్‌ సెక్యూరిటీలో పనిచేస్తున్నాడని.. గ్యాస్ లీక్ కావడంతో వెంటనే తాను అక్కడి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఫోన్ చేశానని.. కానీ అక్కడి నుంచి సరైన స్పందన రాలేదన్నాడు.

వెంటనే తన కుటుంబ సభ్యుల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని చెప్పానన్నాడు అశ్వినికుమార్. తన ఇంటి పక్కనే ఉన్న ఏడు ఇళ్లలో వారిని అలర్ట్ చేశా బయటకు పంపానని.. కొంతమందనిి వెంకటాపురం రైల్వే ట్రాక్ దాటించానన్నాడు. తర్వాత కొద్దిసేపటికి తాను కూడా అస్వస్థతకు గురయ్యానని.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాను అన్నాడు.