చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవ్వడంతో  ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వం ప్రభాకర రెడ్డి జనసేన పార్టీకి షాక్ ఇచ్చారు. 

జనసేన పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలియజేసేందుకే పవన్‌కళ్యాణ్‌ను పర్యటనకు ఆహ్వానించానని అయితే పలు కారణాల రీత్యా ఆయన నియోజకవర్గంలో పర్యటించ లేదన్నారు. ఇక సమస్యలు తెలుసుకోకపోవడంతో ప్రజలకు న్యాయం చేయలేమని భావించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఇకపై తన సొంత బలమైన విశ్వం యువసేన ద్వారా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. 

ఈ ఎన్నికల్లో తనపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితోపాటు ఎంపీ మిథున్‌రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను వారితో కలిసి నడుస్తానని తెలిపారు. 

గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి కూడా అంతకుమించి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తాను ఆశిస్తున్నట్లు విశ్వం ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.