విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బిజెపి నేతలు లక్ష్యం చేసుకున్నారని విషయం మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ పై బిజెపి నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెనకేసుకొచ్చారు. 

గత 70 రోజుల్లో ఇప్పటి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ దొరకలేదని, ఇది పద్ధతి కాదని విష్ణుకుమార రాజు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు చెప్పాలంటే ఒక్క రోజులోనే సమయం దొరికేదని ఆయన గుర్తు చేశారు. 

జగన్ పనితీరు చూస్తుంటే ఆయనకు సరైన సలహాదారులు లేరని అనిపిస్తోందని విష్ణుకుమార రాజు అన్నారు. ప్రజా వేదికను ఒక్క రోజులో కూల్చిన ప్రభుత్వం 70 రోజులు గడుస్తున్నా ఇసుక విధానంపై నిర్ణయం తీసుకోలేకపోయిందని అన్నారు. ఇసుక లభించక లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. 

కాంట్రాక్టర్లను మాత్రమే ప్రస్తుత జగన్ ప్రభుత్వం లక్ష్యం చేసుకుంటోందని ఆయన అన్నారు. గంటా శ్రీనివాస రావు ఏ పార్టీలో ఉంటారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఓట్లు వేసిన విశాఖ ప్రజలకు గంటా అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. గంటా బిజెపిలోకి వస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు.