విశాఖపట్నం: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ తీరుపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే భారత్ లోని ఏపీలో ఉన్నామా? లేదా ఏ పాకిస్థాన్ లోనో లేదంటే ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన తరువాత ఐదుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని కాళ్లపై లాఠీలతో కొట్టారని ఆరోపించారు. 

రాష్ట్రంలో అప్రకటిత ఆత్యయిక పరిస్థితి ఉందన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ఓ ఎంపీని కొట్టడం, భౌతిక దాడులు చేయడమంటే మొత్తం పార్లమెంట్ పై దాడి చేయడమేనని ఆయన అన్నారు. ఓ ఎంపీకే ఇలా జరిగితే మరి సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై రిపోర్ట్ ఇస్తున్నది ఏపీ వైద్యులేనని, కాబట్టి రిపోర్ట్ ను వారు ఎంత వరకు కరెక్ట్ గా ఇస్తారన్న దానిపై అనుమానాలున్నాయని చెప్పారు. 

ఇతర రాష్ట్రాల్లోని ఎయిమ్స్ లేదా రిమ్స్ ఆసుపత్రుల్లోని డాక్టర్లతో రఘురామకు పరీక్షలు చేయించాలని, వారితో రిపోర్ట్ ఇప్పిస్తే కరెక్ట్ గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపైన, ప్రభుత్వం చేసే అరాచకాలపైన మాట్లాడితే దేశ ద్రోహమవుతుందా? అని ప్రశ్నించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎన్నెన్ని మాటలన్నారో అందరికీ తెలుసని గుర్తు చేశారు. 

నడిరోడ్డుపై చంద్రబాబును కాల్చి చంపినా తప్పులేదని ఒకప్పుడు నంద్యాలలో జగన్ కామెంట్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు ఈ సెక్షన్లన్నీ ఏమైపోయాయని మండిపడ్డారు. మరి, అప్పుడు సీబీసీఐడీ సుమోటోగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

కరోనా టైంలో అరెస్టులేంటి? : కరోనా విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమేంటని విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. గతంలో వాట్సాప్ మెసేజ్ పెట్టారన్న కారణంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్నేహితుడిని కర్నూలుకు తీసుకెళ్లారని, అక్కడ కరోనా అంటించి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత అదే కరోనాతో ఆయన చనిపోయారని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో ప్రజలు భయాందోళనల మధ్య బతకకూడదనుకుంటే శని, ఆదివారాల్లోనూ కోర్టులను తెరిచి ఉంచాలని ఆయన అన్నారు. దీనిపై సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. శని, ఆదివారాల్లో కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని ఆలోచించే.. కరెక్ట్ గా శుక్రవారం సాయంత్రమే ప్రభుత్వం అరెస్టులు చేస్తూ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు. 

వాస్తవాలు బయటకు రాకుండా మీడియాపైనా సర్కార్ బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రతిపక్ష సభ్యుల సంస్థలను జగన్ సర్కార్ మూయించేస్తోందని, 20 వేల మంది దాకా పనిచేసే ఎంపీ గల్లా జయదేవ్ ఫ్యాక్టరీ అయిన అమరరాజా బ్యాటరీస్ ను ఇలాగే మూయించిందని విష్ణు కుమార్ రాజు ఆరోపించారు.