విశాఖపట్నం:  వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు మూలధనం కోసం నిధులు ఇచ్చి నిబంధల మేరకు ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఇటీవల ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ-ఆసక్తి వ్యక్తీకరణను)ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు మూలధనం కోసం నిధులు ఇచ్చి నిబంధల మేరకు ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఇటీవల ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ-ఆసక్తి వ్యక్తీకరణను)ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈవోఐ బిడ్ల సమర్పణకు ఏప్రిల్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా నిర్ణయించింది. అయితే ఈ గడువును మరో ఐదో రోజులు పెంచుతూ ఆర్‌ఐఎన్‌ఎల్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బిడ్ దాఖలకు గడువు ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం తరఫున బిడ్ దాఖలు చేసేందుకు సిద్దమైన సింగరేణి సాయంత్రం 5.30వరకు సమయం కోరింది. 

అయితే గడువును పొడిగించినట్టుగా ఆర్‌ఐఎన్‌ఎల్ తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ నెల 20 వరకు గడువు పొడిగిస్తున్నట్టుగా తెలిపింది. అయితే ఈవోఐ‌లో మరిన్ని కంపెనీలు బిడ్‌లు దాఖలు చేస్తాయనే సమాచారంతోనే ఆర్‌ఐఎన్‌ఎల్ గడువు పెంపు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇక, ఇప్పటికే 20కి పైగా బిడ్లు దాఖలైనట్టుగా సమాచారం. ఇందులో పలు బడా కంపెనీలు కూడా ఉన్నాయి. 

ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోని వివిధ యూనిట్లను సందర్శించింది. చీఫ్ జనరల్ మేనేజర్ (ఇంఛార్జి) ఎన్‌వి స్వామి నేతృత్వంలోని విఎస్‌పి అధికారులు ప్లాంట్‌లోని ఉత్పత్తి సౌకర్యాలను సింగరేణి బృందానికి వివరించారు. ఈ క్రమంలోనే అనంతరం అన్ని అంశాలపై సింగరేణి అధికారులు ఓ నివేదికను తయారుచేశారు. దానిని సీఎం కేసీఆర్‌కు కూడా అందజేశారు. అయితే సింగరేణి సంస్థ బిడ్డింగ్‌లో పాల్గొందా? లేదా? అనే అంశంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. బిడ్లు దాఖలు చేసేవారికి ప్రాథమిక అర్హతలు ఉండాలని అధికారులు తెలిపారు. స్టీల్, ముడి సరకు వ్యాపారంలో ఉన్నవారే బిడ్లు వేయాలని చెప్పారు. అయితే ఓ ప్రైవేట్ సంస్థ తరఫున సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ బిడ్ దాఖలు చేశారు. ప్రజల మద్దుతుతోనే తాము బిడ్డింగ్ దాఖలు చేసినట్టుగా లక్ష్మీనారాయణ చెబుతున్నారు.