ఇదో విచిత్రమైన కేసు.. భర్తనుండి విడిపోయిన భార్య మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. విడిపోయిన భర్త ఈ ప్రేమ పెళ్లిని తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దలు ప్రేమపెళ్లిని అంగీకరించలేదని ఆ కొత్త జంటా ఆత్మహత్య చేసుకుంది. 

ఈ విషాద ఘటన విశాఖట్నంలోని సుందరయ్య కాలనీలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖలోని సుందరయ్య కాలనీకి చెందిన నాగిణికి ఐదేళ్ల క్రితం పాపారావు అనే వ్యక్తితో వివాహమైంది. ఏడాది క్రితం భర్తతో విడిపోయి వేరుగా ఉంటోందామె. 

ఈ క్రమంలో నాగిణికి అభిలాష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. నాగిణి ప్రేమ వ్యవహారం అండమాన్‌లో ఉన్న భర్త పాపారావుకు తెలిసింది. అది తట్టుకోలేని పాపారావు.. తీవ్ర మనస్తాపానికి గురై అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

మూడు రోజులక్రితం నాగిణి, అభిలాష్‌లు వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి బ్రతకలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.