ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన విశాఖ జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి భాస్కర్ దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం.

కాటమనేని ... చంద్రబాబుకు అనుకూలంగా ఉంటారని రాష్ట్ర పరిపాలనాశాఖలో అందరికీ తెలుసు.. సీఎం కూడా ముద్దుగా భాస్కర్‌ని చంటి అని పిలుచుకుంటారట. ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం కారణంగానే ఆయన ఎమ్మెల్యేలను గానీ, ఒకానొక దశలో మంత్రులను గానీ లెక్కచేసేవారు కాదన్న వాదన వుంది.

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రజాప్రతినిధులెవ్వరిని ఖాతరు చేసే వారు కాదన్న అపవాదు ఉంది. చంద్రబాబుతో ఉన్న చనువు కారణంగా పట్టుబట్టి మరీ విశాఖ జిల్లా కలెక్టర్‌గా కాటమనేని పోస్టింగ్ వేయించుకున్నారు.

అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలన్నీ వైసీపీ వైపే ఉండటం, టీడీపీ నేతలు కిక్కురుమనకపోవడంతో భాస్కర్ కాస్తంత ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వం వస్తే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనన్న భయంతో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాటమనేని దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం దగ్గర ఉంది.