పెళ్లి చేసుకుని ఏడడుగులు నడవటానికి సిద్ధపడ్డ ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపిన ప్రేమోన్మాదికి విశాఖ న్యాయస్థానం అరుదైన శిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే.. 2014లో విశాఖపట్నం 26వ వార్డు పండా వీధిలో నివసిస్తున్న బూరలి భవానితో, అదే వార్డుకు చెందిన బొందలపు సతీష్ కుమార్‌కు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.

ఈ విషయాన్ని ఇద్దరు తమ కుటుంబసభ్యులకు తెలిపి, పెళ్ళికి కూడా ఒప్పించారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఇరు కుటుంబాల వద్దకు రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా సతీశ్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. భవానీపై అనుమానం వ్యక్తం చేయడం, అసభ్యపదజాలంతో దూషించడం లాంటివి చేసేవాడు.

2017 జూలై 8 మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో భవానికి సతీష్ ఫోన్ చేసి, నీతో మాట్లాడాలని ఉందని, మా ఇంటికి రావాలని పిలిచాడు. ఆ సమయంలో అతని ఇంట్లో ఎవరూ లేరు.. అతని ఇంటికి వెళ్లిన భవాని.. సుమారు 1.30 ప్రాంతంలో సతీశ్ ఇంటి తలుపులను పెద్దగా కొడుతూ... ఏడుస్తూ స్థానికులను పిలవడం ప్రారంభించింది.

అప్పటికే ఇంట్లో ఉన్న ఓ కిటికీ అద్దాన్ని పగులగొట్టిన సతీశ్ ఆ గాజు ముక్కతో భవాని మెడను బలంగా కోశాడు. స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ.. వారిపైనా ఆ గాజుపెంకు, డంబెల్‌తో దాడి చేశాడు. అప్పటికే మరణించిన భవాని మృతదేహాన్ని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు వచ్చిన సతీశ్‌ను యువకులు ఎట్టకేలకు అడ్డుకున్నారు.

దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నాటి నుంచి సాగిన దర్యాప్తులో నిన్న వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి రెండు యావజ్జీవ శిక్షలు విధించి... వాటిని ఏకకాలంలో అమలు చేయాలని సూచించింది. తుదితీర్పును వెలువరించింది. అత్యంత కిరాతక ప్రవర్తన కారణంగానే ఇలాంటి శిక్ష విధించాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు.