తాడేపల్లి: దేవాలయాల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించినట్లు శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. ఇవాళ(బుధవారం) క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి.

సీఎంతో భేటీ అనంతరం స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ...ఇప్పటివరకు దేవాలయాలు, దేవతా విగ్రహాలపై జరిగిన దాడులపై దర్యాప్తును వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. స్వరూపానంద స్వామివారు ఇచ్చిన సూచనలను కూడా నివేదించామని అన్నారు. 

''ప్రైవేటు ఆలయాల కమిటీలతో కూడా దేవాదాయశాఖ, పోలీసులు సమన్వయం చేసుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్‌ స్టేషన్‌ల వారీగా దృష్టిపెట్టాలి. దుశ్చర్యలను తీవ్రంగా తీసుకుని దోషులకు కఠిన చర్యలు తీసుకోవాలి. సనాతన ధర్మం కాపాడ్డంలో ఇవన్నీకూడా అవసరం'' అని సూచించినట్లు తెలిపారు.

''తాను చెప్పిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రతి అంశాన్నీ కూడా నోట్‌ చేసుకున్నారు. దర్యాప్తును తీవ్రతరం చేస్తామని చెప్పారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు'' అని వెల్లడించారు.

వీడియో

''ఇక గత ప్రభుత్వం హయాంలో విజయవాడలో పడగొట్టిన దేవాలయాల పునర్‌ నిర్మాణానికి ఈ నెల 8న శంకుస్థాపన చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి నాకు చెప్పారు. ఇప్పటికే 30వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా సీఎం నాతో అన్నారు. దేవుడు మనుషులను రక్షించాలి, అలాంటిది దేవుడు ఉన్న ఆలయాలను మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడ్డంలోప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు'' అని స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి తెలిపారు.