విశాఖపట్నం: ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగలనుంది. మరో టీడీపీ ఎమ్మెల్యే టీడీపీకి దూరం కానున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. గత ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 

వాసుపల్ల గణేష్ శనివారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వైసీపీకి మద్దతు తెలియజేస్తారు. సాంకేతికంగా ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉండకపోవచ్చు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాదిరిగా టీడీపీకి దూరమై వైసీపీ గూటిలో చేరనున్నారు. గత కొంత కాలంగా వాసుపల్లి గణేష్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

టీడీపీ తరఫున శాసనసభకు పోటీ చేసి విజయం సాధించిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి మాదిరిగానే వాసుపల్లి గణేష్ కూడా వైసీపీలో సాంకేతికంగా చేరరు. కానీ జగన్ వెంట నడుస్తారు. వైసీపి కండువా కప్పుకోరు.

వాసుపల్లి గణేష్ టీడీపీ గుడ్ బై చెప్పడం వల్ల చంద్రబాబుకు భారీ నష్టమే జరుగుతుంది. విశాఖపట్నాన్ని కార్యనిర్వహక రాజధానిగా చేయడానికి జగన్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ చేరిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.