విశాఖ జిల్లా అరకు లోయ సమీపంలో శనివారం జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి సవతే నిందితురాలిగా పోలీసులు నిర్థారించారు. వివరాల్లోకి వెళితే.. మహేశ్‌, రాజేశ్వరి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే చినబాలుడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కిల్లో పుష్పను మహేశ్ రెండో పెళ్లి చేసుకుని.. ఈ నెల 1న అరకులోయ సీ కాలనీలో వేరే కాపురం పెట్టాడు. అప్పటికే రాజేశ్వరికి ఇద్దరు పిల్లలున్నారు.. భర్త రెండో పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె... పుష్పపై కక్ష పెంచుకుంది.

పుష్పను అడ్డు తొలగించుకోవాలని భావించిన రాజేశ్వరి పథకం వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో భర్తకు ఆరోగ్యం బాగోలేదని నమ్మించి.. సీ కాలనీలో ఉన్న పుష్పను శరభగుడలో ఉన్న తన ఇంటివైపునకు తీసుకెళ్లింది.

ఆ మార్గంలోని నీలగిరి తోటల వద్ద పుష్పపై దాడి చేసి.. చున్నీతో గొంతు నులిమి చంపేసింది. దీనిని అత్యాచారం, హత్యగా నమ్మించేందుకు పుష్ప శరీరంపై రాజేశ్వరి దుస్తులు తొలగించింది.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరిని నిందితురాలిగా నిర్థారించారు.

పుష్ప గిరిజన మహిళ కావడంతో రాజేశ్వరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పుష్ప కుటుంబానికి ఆర్ధిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.