వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు జరుగున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఇరు పార్టీల కార్యకర్తలు మరోసారి బాహాబాహీకి దిగారు.

కుప్పం నియోజకర్గంలోని శాంతిపురంలో ఇవాళ, రేపు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుండటంతో తెలుగుదేశం శ్రేణులు శాంతిపురంలో బ్యానర్లు ఏర్పాటు చేశాయి.  

ఈ క్రమంలో వాటిని తొలగించాలంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ బ్యానర్లు ఉన్న స్థానంలో టీడీపీ శ్రేణులు బ్యానర్లు కట్టడమే గొడవకు కారణంగా తెలుస్తోంది.

దీంతో దాదాపు 3 గంటల పాటు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

తనను వరుసగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్న కుప్పం ప్రజలు, పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలపనున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయన పర్యటించనున్నారు.